Saturday, November 3, 2012

సమస్య - The Problem

"చిట్టి - The Robo" స్టైల్ లో వుంది కదా హెడింగ్. అబ్బే అంత సీను లేదండి. కొంచెం వెరైటీ గా వుంటుంది అని అలా పెట్టాను అంతే. నేను ఈ  మద్య  ఎవరిని  కదిలించినా  కూడా  ముందుగా   మాట్లాడేది  సమస్యల  గురించే.  ఇలాంటివి  ఒక  రెండు  మూడు విన్న తరవాత నా ఆలోచనల ఫలితమే ఈ టపా.

నాకు తెలిసి సమస్య అనే పదం వాడని మనిషి ఈ రోజుల్లో అసలు ఉండడేమో.  కానీ నాకు సమస్య వుంది అని అనుకునే ప్రతివాళ్ళు నిజంగా సమస్యల్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తారా? ఏమో నాకైతే అనుకోమానమే. ఎవరైనా మన దెగ్గరికి వచ్చి ఫలానా మనిషి నన్ను ఫలానా విధంగా బాధ పెట్టాడు అనో, లేదా ఫలానా మాట అన్నాడు అనో చెప్పారు అనుకోండి మనం అయ్యో అవునా? అలా అన్నాడా? అలా చేసాడా? అని ఆశ్చర్యపోవటమే తప్ప ఒక్క నిమిషం ఆగి అవతలి మనిషి అలా ఎందుకు చేసి వుంటాడు, కారణం ఏమై వుంటుంది అసలు నిజంగానే అలా చేసాడా లేకపోతె సంఘటనల మూలంగా మనం అలా అపార్ధం చేసుకుంటున్నామ? అని ఆలోచిస్తామా ? లేదు కదా?  ఎప్పుడైనా మనం ఎవరి మూలంగా ఐనా బాధపడినప్పుడు మనం ఒక్క నిమిషం ఆగి ఎదుటి వారి తరపునించి కూడా ఆలోచిస్తే ఆ సమస్య అసలు సమస్యే కాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఒకరికి సమస్య గా కనిపించే విషయం మరొకరికి సంతోషంగా అనిపించవచ్చు. అవతలి వాళ్ళకి సంతోషం  కలిగిస్తుంది  కదా  అని మనం సమస్యని సమస్య అని ఫీల్ అవ్వకుండా కూడా ఉండలేము. వేరే వాళ్ళ ప్రవర్తన మూలంగానో మాటల మూలంగానో మనకు బాధ కలిగినప్పుడు మాత్రం మనం వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అది బాధ కలిగించాకపోవచ్చు.  కనీసం  వాళ్ళు  మనల్ని  మోసం చేయలేదు  అనో, వాళ్ళు మనలని  బాధ పెట్టాలనే ఉద్దేశ్యం తో అలా  చేయలేదు  అని  ఐనా  అనిపించవచ్చు. ఆ  ఆలోచన  కూడా  మనకి  ఎంతో  కొంత సాంత్వన  ని  చేకూరుస్తుంది. ప్రతి సారీ ఇలాగె జరగాలని రూలు ఏమి లేదు, కానీ ప్రతిసారి అలా ఆలోచించటం మాత్రం మనల్ని ఎంతో కొంత లాభ పరుస్తుంది అని నా నమ్మకం.

అంతేకాదు ఒక సమస్య గురించి మనం విన్నప్పుడు ఎవరిది తప్పు అన్న సందేహం కలుగుతుంది. మరి ఆ విషయాన్నీ ఎలా నిర్ణయిస్తాం? ఒక్కరి వాదన విని వాళ్ళదే కరెక్ట్ అని, రెండవ వాళ్ళది తప్పు అని నిర్నయిన్చేస్తాం. అలాంటి బాధితుల జాబితాలో నేను కూడా వున్నాననుకోండి.  అందుకే ఆ బాధ ఎలా వుంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఎవరైనా ఏదైనా కంప్లైంట్ చెప్పగానే అవతలి వాళ్ళ మాట కూడా వినకుండా తప్పు ఎవరిదీ అని నేను తొందరగా  డిసైడ్ చేయను.  ప్రతిసారి ఇలానే చేస్తాను అని కాదు కానీ కనీసం ఆ ఆలోచన ఐనా నా మనసులో వుంటుంది.

అయినా ఎవరో చెప్పినట్టు అసలు ఈ సమస్య అనేది జీవితం లో లేకపోతె మనిషికి సంతోషం విలువ తెలియదు కదా. ఏది ఏమైనా ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దం లో చూడటం మానేసి మనకన్న ఎక్కువగా కష్టాలు పడేవాళ్ళు చాలా మంది వున్నారు అని అర్ధం చేసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం. కనీసం కష్టాలని చూసి బాధ పడుతూ కూర్చోకుండా వాటిని పరిస్కరించుకోవటం ఎలాగో ఆలోచిస్తే బాగుంటుంది.

ఐతే ఏదైనా పని చేసే ముందు ఎదుటి వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పగలిగే రోజులు కూడా కావివి. అలా చెప్తే ముందు చెప్పిన వాళ్లనే  పిచ్చి వాళ్ళ లా చూస్తారేమో. కానీ కనీసం బాధ  పడేవాల్లైన  విషయాన్ని ఆ కోణం లో ఆలోచిస్తే కొంత వరకు  సాంత్వన లభిస్తుందేమో. 

Tuesday, September 11, 2012

సెప్టెంబర్ 8, 2012

 

జీవితం లో కొన్ని రోజులు మనం ఎంత మరిచి పోదాము అని అనుకున్నా ఆరోజు జరిగిన సంఘటనలు మనలని ఆ రోజుని అంత తొందరగా మరిచిపోనివ్వవు. నా జీవితం లో అలాంటి ఒక సంఘటన జరిగిన రోజు సెప్టెంబర్ 8, 2012.

ఆరోజు శనివారం, వీకెండ్ హాలిడే. హాలిడే వచ్చిందంటే చాలు, ఆరోజు జరగాల్సిన పనులన్నీ తారు మారు ఐపోతూ ఉంటాయి. మా పిల్లలిద్దరూ ఏదో తిన్నాం అనిపించి మా శ్రీవారితో కలిసి బ్యాట్లు పట్టుకొని బయట పడ్డారు. ఇంటి ముందు షటిల్ ఆడుకోవటానికి. సరే, వాళ్ళు వచ్చేసరికి చాలా టైం పడుతుంది లే అని, నేను మద్యానానికి వంట సిద్దం చేసే పనిలో పడ్డాను. 500 అపార్ట్మెంట్ల దాకా వుండే మా  కాంప్లెక్స్ లో మా ఫ్లాట్ కి  ఎదురుగానే  కొంచెం  ఓపెన్ ఏరియా, దాని పక్కనే స్విమ్మింగ్ పూల్ వున్నాయి . పూల్  చుట్టూ  గ్రిల్స్  కూడా  వున్నాయనుకోండి,  దానికి ఎప్పుడూ లాక్ కూడా వుంటుంది. ఆ అపార్ట్మెంట్  లో నివసించే  వాళ్ళకి  మాత్రమే  ఆ కీ ఇస్తారు. ఒక గంట తరవాత మా పిల్లలిద్దరూ  వాటర్  కావాలంటూ  నిండా  తడిసిన  బట్టలతో  ఇంట్లోకి  వచ్చారు. అప్పుడు అర్ధం ఐంది  వాళ్ళు  అటునించి అటే స్విమ్మింగ్ కి  వెళ్ళారని.  మామూలుగా  ఒక  సారి  ఇంట్లోకి  వచ్చిందంటే  మా  అమ్మాయి  మళ్లీ   స్విమ్మింగ్  కి  వెళ్ళదు.  కానీ అన్నయ్యని  చూసి మళ్లీ వెళ్ళింది వాడి వెనకాలే.  

            వంట దాదాపుగా ఐపోవస్తుంది అనగా స్విమ్మింగ్ పూల్ నుండి గట్టిగా కేకలు వినపడ్డాయి, మా అయన గొంతుతో. ఏమైంది, ఇంత గట్టిగా అరుస్తున్నాడు అనుకుంటూ నేను గబా గబా బయటికి వస్తున్నాను, ఈలోగా నా కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు, "mummy, Minni  not talking" అని. మాట్లాడక పోవటం ఏమిటి, ఏమైంది, అనుకుంటూ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను పూల్ లోనికి. అప్పటికే ఎవరో ఒకతను అక్కడ నిలబడి 911 కి (అమెరికా లో ఎమర్జెన్సి నెంబర్) ఫోన్ చేస్తున్నాడు. మా అయన మా పాపని చేతిలో పట్టుకొని మిన్ని, మిన్ని(దాని ముద్దు పేరు) అని గట్టిగా అరుస్తున్నాడు. మా పాపకే ఏదో జరిగిందని నాకు అర్దం ఐపోయింది.  కానీ ఏమైందో తెలియదు. నేను వెళ్ళగానే అయన దాన్ని నా చేతుల్లో పెట్టాడు. దాని పరిస్థితి చూస్తే గుండె ఆగినంత పని ఐంది. శ్వాస లేదు,  స్పృహ లేదు, ఎటు వేస్తె అటు పడి  పోతుంది. ఏమైందో తెలియదు. అసలే ఆరోజు ఉదయాన్నే దాని ముక్కులోనిండి కొంచెం రక్తం కారింది. చిన్న పిల్లలకి అప్పుడప్పుడు అలా జరగటం సాదారణమే అని అంతకముందు డాక్టర్ చెప్పటం తో నేను సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు చూస్తే దాని మూతి చుట్టూ కొంచెం ఎర్రగా కనపడింది. అంటే, ఆ విషయం ఏమైనా సీరియస్ ఐందా? కింద పడిందా? ఏమి అర్ధం కాలేదు, కానీ ఏదో జరిగింది. ఆ ఒక్క క్షణం లోనే నా మనసులో లక్ష ప్రశ్నలు. నేను దాన్ని గట్టిగా అరుస్తూ ఏమైంది, ఏమైందే అని అడుగుతుంటే మా అయన అప్పుడు పొట్ట వత్తు అన్నాడు, అప్పుడు అర్ధం ఐంది అది పూల్ లో పడిందని. నీళ్ళు మింగిందని. పోట్టంతా బలూన్ లా ఉబ్బిపాయింది. ఇంక ఆలస్యం చేయలేదు నేను. నెమ్మదిగా పొట్ట వట్టుతుంటే నీళ్లన్నీ బయటికి వస్తున్నాయి, ముక్కులోనించి, నోట్లోంచి. నీళ్లన్నీ తీసేసాను, ఇంక వత్తిన నీళ్ళు రావటం లేదు, కానీ అది మాత్రం కండ్లు తెరవలేదు. కనీసం కదలను కూడా కదలటం లేదు. ఏమి చేయాలో కూడా అర్ధం కాలేదు. చుట్టూ జనం చేరారు. నేను మిన్నీ , మిన్నీ అని అరుస్తూ, చెంపల మీద కొడుతున్నాను. ఐనా చప్పుడు లేదు. వెంటనే దాని నోరు తెరిచి, గట్టిగా గాలి వూదాను దాని నోట్లోకి. పొట్టలో చలనం కనిపించింది, మూడు నాలుగు సార్లు అలాగే చేశాను ఒక్క సారిగా ఆ అంటూ గట్టిగా ఊపిరి తీసింది. చిన్నగా కండ్లు తెరిచింది. పోఇన ప్రాణం తిరిగి వచ్చినంత పని అయింది నాకు. నేను ఇంకాస్త గట్టిగా అరవటం మొదలు పెట్టగానే అది ఏడుపు స్టార్ట్ చేసింది. మా ఆయన దానికోసం తువ్వాలు తెస్తానని లోపలకి పరిగెత్తుకెళ్ళి వచ్చాడు. ఎమర్జెన్సి వాళ్ళు ఇంకా రాలేదు. మా అయన లో బయం ఎక్కువైంది. వెంటనే పక్కింటి ఫ్రెండ్ కి కార్ స్టార్ట్ చేయమని చెప్పాడు. అతను ఒక్క నిమిషం లో కారు  తీసుకొని వచ్చాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నాను. వెనకాలే మా అయన పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎమర్జెన్సి వాళ్ళు వచ్చారు ఆగమని. అమెరికా లో ఒక మంచి విషయం ఏమిటంటే, ఎవరైనా ఎమర్జెన్సి నెంబర్ కి కాల్ చేస్తే, పోలిస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ మూడు వచ్చేస్తాయి, 5 నిమిషాల్లో.

          వెంటనే పొలిసు వాళ్ళు పాపని నా చేతిలో నుండి తీసుకున్నారు. కారు డిక్కీ లో పడుకో బెట్టారు, అప్పటికే అది ఏడుస్తూ వుంది. కాసేపు oxygen పెట్టారు. ఇంకో పక్క మా అయన ఇంక తట్టుకోలేక అక్కడే కూలబడిపోయాడు. ఒక పోలీసు మా ఆయన్ని, ఇంకొకతను మా పాపని చూసుకున్నారు. మా ఫ్రెండ్  మా బాబుని పట్టుకుంది. నేను పక్కనే నిలబడి మా పాపని చూస్తున్నాను. ఒక 5 నిముషాలు ఫస్ట్ ఎయిడ్ తరవాత,  పాపని హాస్పిటల్ కి తీసుకెళ్లటం తప్పని సరి అని, తను ఏడవటం మంచిదే అని, అలాగే ఎడవనివ్వమని పొలిసు చెప్పాడు. మా అయన అప్పటికి కాస్త తేరుకున్నాడు. కానీ మా పరిస్థితి చూసిన ఆ పోలీసు "మేము అంబులెన్స్ లో పాపని తీసుకెళతాం , నువ్వూ పాపతో రావొచ్చు, ఇప్పుడు తండ్రి వచ్చే పరిస్థితి లో లేడు" అన్నాడు . నేను సరే వస్తాను అన్నాను. మా ఆయనకి డ్రైవింగ్ చేయొద్దని, ఫ్రెండ్ కార్ లో రమ్మని చెప్పి, నన్ను పాపని తీసుకొని అంబులెన్స్ లో కాప్స్ బయలుదేరారు. వాళ్ళు ముందే హాస్పిటల్ పేరు చెప్పటం తో మా అయన, ఫ్రెండ్ కలిసి వెనకాలే వచ్చారు. మేము హాస్పిటల్ కి 4 నిమిషాల దూరం లో ఉండగానే, ఆ cop హాస్పిటల్ కి ఫోన్ చేసి నాలుగు నిమిషాల్లో అక్కడ ఉంటామని చెప్పాడు. మేము వెళ్ళేసరికి అక్కడ అంతా రెడీ. రూం, కనీసం 10 మంది డాక్టర్ లు , నర్సులు అంతా రెడీ గా వున్నారు. పాప పరిస్థితి చాలా సీరియస్ గా వుందని 24గంటలు గడిస్తేనే కానీ ఏమి చెప్పలేమని, అన్ని పరీక్షలు చేయాలనీ డాక్టర్ లు చెప్పారు. ప్రానానికేమి బయం లేదని చెప్పమని అడిగాను, అది కూడా చెప్పలేమన్నారు. అంతా అస్సెస్స్ చేయటానికి టైం కావాలన్నారు. లోపల పాపతో నేను వక్కదాన్నే వున్నాను. పాపకి దారిలో సీసర్స్ (ఫిట్స్ ) వచ్చాయని, కాబట్టి పరిస్థితి ఇప్పుడే ఏమి చెప్పలేమని చెప్పారు. బయటి నుంచి మా అయన ఫోన్ల మీద ఫోన్లు , ఎలా వుంది, నేను రావొచ్చా అని. కానీ వాళ్ళు రానివ్వలేదు. ఎవరో ఒక్కరే వుండాలన్నారు. దాని వంటి నిండా ఏమేమో వైర్లు పెట్టారు. నిజం చెప్పాలంటే అప్పుడు చూస్తేనే దాన్ని ఎక్కువ భయం వేసింది నాకు. ఏమిటి వీళ్ళు ఎందుకు, ఇదంతా చేస్తున్నారు అనిపించింది. కానీ వాళ్ళకంటే మనకి ఎక్కువ తెలియదు కదా అని సర్ది చెప్పుకున్నాను. ఎవర్ని అడిగినా ఒకటే మాట, అప్పుడే చెప్పలేం అని. CT  స్కాన్ చేసారు, ICU రూం కి షిఫ్ట్ చేసారు. అప్పుడు మా ఆయన్ని కూడా రానిచ్చారు. ఇంకుబేటర్ పెట్టారు. దాదాపు 2, 3 నిముషాలు బ్రెయిన్ కి ఊపిరి అందలేదు కాబట్టి తన పరిస్థితి ఎలా వుంటుందో చెప్పలేమన్నారు. మిమ్మల్ని గుర్తు పడుతుందో లేదో గ్యారంటీ గా చెప్పలేము, కొన్ని సార్లు అలా కూడా జరగోచ్చు అన్నారు. అంతే కాకుండా పాప కి మత్తు మందు ఇచ్చి పడుకోబెట్టారు. మద్య మద్యలో తను లేవటం, వైర్లు పీక్కోవటానికి ట్రై చేయటం వాళ్ళు మళ్లీ మందు ఇచ్చి పడుకోబెట్టటం , ఇదే పని అర్ధ రాత్రి వరకు.


         అంతా  కాస్త  సర్దుకున్నాక  అడిగాను  మా  ఆయన్ని  అసలు  ఏమైంది  అని,  వాళ్ళు  ముగ్గురూ   స్విమ్మింగ్   చేస్తూ  వుండగా  ఒక నైబర్  అక్కడికి  వచ్చాడని,  అతను  ఏదో  మాట్లాడుతుంటే  పాపని  ఒక్క  నిమిషం  అక్కడ  కుర్చోబెట్టానని ,  ఒక  నిమిషం  తరవాత  చూస్తే  అది  కనపడలేదు  నీళ్ళలోకి  చూస్తే  అడుగున  పదిపొఇ  వుందని  చెప్పారు.  అక్కడ  అంతక  ముందే  స్పా  ఆన్  చేసి  వుండటం  వల్ల  ఆ  శబ్దం  లో  పాప  అరిచినట్టు  కూడా  వినపడలేదు  అని చెప్పారు. పూల్ అడుగున బోర్ల పడి పోయి వుందని చెప్పారు. వెంటనే  నీళ్ళలో  నుండి  బయటికి  తీస్తే  అది  అలా  కనిపించింది  అని చెప్పారు.

     ఆ రోజు అర్ధరాత్రి  తరవాత పైపులు తీసేసారు.  నోట్లో నుంచి, ముక్కులో నుంచి పైపులు తీయగానే అది కొంచెం ఫ్రీ అయింది. అది తీస్తూ తీస్తూ ప్రతీ నర్సూ గుడ్ గర్ల్ అంటూ వుండేది. పైపులన్ని తీసిన ఒక 10 నిమిషాల తరవాత, అది మాట్లాడిన మొదటి మాట "mummy, I am a good girl" అని. అప్పటికి కానీ మనసు కుదుటపడలేదు. అది మమ్మల్ని గుర్తు పట్టటం, నన్ను తన పక్కన పడుకోమనటం తో relax అయ్యాము. దాని మొహాన్ని తీక్షణంగా చూస్తుంటే, "what , why you  looking at  me ?" అంది. నవ్వు ఆగలేదు. ఆ తరవాత ఇంకో 12గంటలు ICU  లోనే వుంచి ఆ తరవాత డిశ్చార్జ్ చేసారు.  మరుసటి రోజు మా పాప pediatrician దెగ్గరికి వెళ్ళమన్నారు. సరే అని తెల్లారే అక్కడికి వెళ్ళాము.

      ఆమె మాకు 5సంవత్సరాలుగా తెలుసు. మా బాబుకి కూడా ఆమె డాక్టర్.  ఆమె చెప్పిన మాటలు విని మేము ఇంకా షాక్ అయ్యాము. పాపని చూసిన డాక్టర్లు ఆమెకి ఎప్పటికప్పుడు update చేసారని, వాళ్ళకి ముందు అస్సలు hopes లేవని, మీ పాప ఇంత తొందరగా ఇంటికి రావటం ఒక miracle అని ఆమె చెప్పింది. ఆ తరవాత నాకు కూడా జరిగిందంతా తలుచుకుంటే అది నిజమే అనిపించింది. ఎందుకంటే, పాప నీల్లల్లొ పడిపోయినప్పటినుండి నేను పరిగెత్తుకు వెళ్లి వీళ్ళు తీసేసి, ఊపిరి ఇచ్చేవరకు కనీసం 3 నిమిషాల సమయం పట్టింది. అంటే అంత సేపు దానికి ఊపిరి అందలేదు. ఐనా అది ఈరోజు అది నా కళ్ళముందు నవ్వుతూ తిరుగుతుంది అంటే, బహుశా అది ఆ భగవంతుడి దయే కావొచ్చు.  కానీ చూసిన ప్రతి ఒక్కరు, చివరకి డాక్టర్ల తో సహా నేనే నా కూతుర్ని కాపాడాను అని అంటుంటే ఒకింత గర్వంగా రెండింతల సంతోషంగానూ వుంది. కానీ తనవల్లె ఇలా జరిగిందని , ఒక్క నిమిషం ఏమరుపాటులో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని మా అయన అనుక్షణం బాధ పడుతూనే వున్నారు. ఆ బాధ అయన మొహం లో స్పష్టంగా కనపడుతూనే వుంది. అది చూస్తూ చూస్తూ ఆ తప్పు ఎలా చేసావని నేనెలా అడగను, అందుకే అందులో తన తప్పు లేదని, అయన కావాలని చేయలేదని ఇప్పుడు పాప బాగున్నందుకు సంతోషించమని చెప్పాను . ఇది తనకి పునర్జన్మ లాంటిది కనక, తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు మా అయన :-) .


Wednesday, July 18, 2012

బాబోయి దొంగలు

మనకు తెలిసినంత వరకు దొంగలు దొంగతనానికే వస్తారు. కానీ దొంగతనం చేయటానికి వచ్చానని డైరెక్ట్ గా మనకి చెప్పటానికే వస్తే...

నేను P.G. చేసేటప్పుడు ఇంటికి దూరంగా వేరే ఊర్లో వుండాల్సి రావటం వల్ల లేడీస్ హాస్టల్ లో వుండేదాన్ని. మా హాస్టల్ ఆ వీధిలో చివర వుండేది. అంటే అది డెడ్ ఎండ్ అన్నమాట. మా గది సెకండ్ ఫ్లోర్ లో వుండేది. మా రూము కి ఆనుకొని ఇంకొక రూం కూడా వుండేది. రెండు రూముల్లోకి మద్య ఒక డోర్  వుండేది. మా రూం లో నాతో పాటు ఇంకో ఇద్దరు డిగ్రీ అమ్మాయిలు వుండేవాళ్ళు. నా  పక్క రూం లో మాత్రం ఇద్దరు ఫార్మసి అమ్మాయిలు వుండేవాళ్ళు. మామూలుగా డిగ్రీ వాళ్ళకి ముందుగా ఎగ్జామ్స్ ఉండేవి. మాకు ఆలస్యంగా, అందరికి అయిపోయాక ఉండేవి. అలా ఒకసారి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఐపోయాక మాకు సెమిస్టరు ఎగ్జామ్స్ మొదలయ్యాయి. నాతో పాటు ఇద్దరు డిగ్రీ అమ్మాయిలు వుండేవాళ్ళు అని చెప్పాను కదా. వాళ్ళకి ముందే పరీక్షలు అయిపోవటం తో నా రూం మేట్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలాను, నా రూం లో.

మా రూం కి ఎప్పుడు క్లీన్ గా వుంటుంది అని ఒక మంచి పేరు వుండేది ఆ హాస్టల్ లో. కాబట్టి ఎప్పుడు వీలు కుదిరినా ఎవరో ఒకరు మా రూం లో పడుకోవాలని అవకాశం కోసం చూస్తూ వుండేవాళ్ళు చాలా మంది వేరే రూముల్లో వుండే అమ్మాయిలు. మా పక్క రూం చాలా పెద్దది అవ్వటం వల్ల , దాంట్లో ఏడుగురు అమ్మాయిలు వుండేవాళ్ళు. అందరూ  కూడా MCA చేస్తున్నారు. ఇప్పుడు రూం లో నేను ఒక్కదాన్నే వున్నాను కదా, వెంటనే వాళ్లలో ముగ్గురు అమ్మాయిలు నా గదిలో పడుకోవటానికి పర్మిషన్ అడిగారు. సరే నాకు కూడా తోడు వుంటుంది కదా అని సరే అన్నాను. అలా ఆరోజు రాత్రి నలుగురం అమ్మాయిలం మా గదిలో పడుకున్నాం. మరుసటిరోజు వాళ్ళకి exam వుండటం తో వాళ్ళు ముగ్గురూ నాలుగింటికి అలారం పెట్టుకొని పడుకున్నారు. అలా అనుకున్నట్టుగానే నాలుగింటికి ముగ్గురూ లేచి చదువుకుంటున్నారు.

అలా వాళ్ళు ముగ్గురూ లైట్లు వేసుకొని కిటికీలు తెరుచుకొని చదువుకుంటూ వుండగా  కిటికీ ఎదురుగా కూర్చున్న ఒక అమ్మాయికి కిటికీ దెగ్గర చిన్న అలికిడి ఐంది. ఎవరా అని ఆశ్చర్యపోతూ అటువైపు చూసింది. ఎవరో ఒక అబ్బాయి కిటికీ కి అనుకోని నిలబడి వీళ్ళనే చూస్తున్నాడు. నాకు నిద్ర విషయం లో ఒక అలవాటు వుంది. ఒకసారి గాఢ నిద్ర లోకి వెళ్ళిపోతే అంత తొందరగా లేవను. కాబట్టి అక్కడ జరిగే conversation లో నేను లేను, ఇంకా పడుకొనే వున్నాను. ఆ అమ్మాయి అతన్ని చూడగానే (లోపల భయపడుతూనే) "ఎవడ్రా నువ్వు" అని అడిగింది. అతను , "దొంగని" అని సమాదానం చెప్పాడు.

అమ్మాయి: ఇక్కడికి ఎందుకు వచ్చావు?
దొంగ:  దొంగతం చేయటానికి
అమ్మాయి: మర్యాదగా వెళ్ళిపో, లేదంటే అందరిని పిలుస్తాను
దొంగ: మీతో మాట్లాడాలి, తలుపు తియ్యవా ప్లీజ్
అమ్మాయి: ఏం  , పిచ్చి పిచ్చిగా వుందా ?
దొంగ: తలుపు తీస్తే ఎలా వుందో చెప్తాను
...
..

ఇలా వాళ్ళ సంభాషణ జరుగుతుండగా కిటికీ కి అటు పక్క ఇటు పక్క కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు ఆ దొంగ మొహం చూడటానికి కూడా భయపడుతున్నారు. బుక్ లోనుండి మొహం కూడా తిప్పకుండా వింటున్నారు. అలా వింటూ వింటూ వాళ్ళ భయం తారా స్తాయికి చేరేసరికి ఇంక ఆగలేక గట్టిగా అరవటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మొదటి అమ్మాయి కూడా విపరీతంగా అరవటం మొదలు పెట్టింది. మాములుగా మాటలు అంటే వినపడవు కానీ మరీ అంత పెద్ద అరుపులు వినపడకుండా ఎలా వుంటాయి. వాళ్ళ అరుపుల్లాంటి కేకలకి పక్కనే బాంబు పడ్డంత భయంగా మెలకువ వచ్చింది నాకు. వీళ్ళు అరవటం మొదలు పెట్టగానే ఆ దొంగ కూల్ గా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ దెగ్గర ఎవరు లేరు. వీళ్లేమో ఒకటే అరుపు. ఆ అరవటం కూడా ఎంత భయంకరంగా వుందంటే నిద్రపోతున్న వాళ్ళని ఒక దయ్యం స్వయంగా నిద్ర లేపితే ఎలా వుంటుందో అలా వుంది. ఇంక నా ఆలోచనలు పరి పరి విధాలుగా సాగుతున్నాయి. ఏమైంది అని అడిగితే ముగ్గురిలో ఎవరూ  కూడా అరుపు ఆపరు , సమాదానం చెప్పరు. కిటికీ దెగ్గర చూస్తే ఎవరూ లేరు, కొంపదీసి పాముగాని వచ్చిందా అని చేద్దర్లు కూడా అన్ని కదిపి చూసాను కానీ ఏమి కనపడలేదు. అరె, ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు? ఎంత ఆలోచించినా నాకు బుర్ర వెలగటం లేదు, ఆలోచన తట్టటం లేదు.

మా గదికి అనుకొని ఇంకో గది కూడా వుంది అని చెప్పాను కదా. వీళ్ళు ముగ్గురూ ఆ గది తలుపుల మీద పడి మరీ అరుస్తున్నారు, ఎవరో తరుముతున్నట్టుగా. సరే ఇంక లాభం లేదనుకొని వాళ్ళ ముగ్గురిని నేను గట్టిగా పక్కకి లాగి ఆ డోర్  తెరిచి వాళ్ళ  ముగ్గిరిని పక్క గదిలోకి తోసేసాను. వీళ్ళ అరుపులకి ఆ గదిలో వున్న ఇద్దరు అమ్మాయిల తో పాటు మా హాస్టల్ లో వున్న మిగితా అమ్మాయిలు అందరూ నిద్ర లేచారు. కానీ ఎవ్వరికి విషయం ఏంటో అర్ధం కావటం లేదు. ఎవరైనా వచ్చారా? ఏమైనా జరిగిందా? ఇలా ఏవేవో ఆలోచిస్తున్నారు. కానీ ఎవరికీ గదిలోకి వచ్చే ధైర్యం మాత్రం లేదు. నేను వీళ్ళని పక్క గదిలోకి తీసుకు వెళ్ళగానే వాళ్ళు నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు , ఏమైంది ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు అని? నాకేం తెలుసు వాళ్ళకి చెప్పటానికి.


కింది ఫ్లోర్ లో వుండే అమ్మాయిలు, వార్డెన్లు అందరు ఒకటే భయపడిపోతున్నారు. సరే, ఇంక ఇక్కడే వుంటే వాళ్ళని కాపాడలేము కదా అని హాస్టల్ ఓనర్, కింద వున్న అమ్మాయిలు అందరు కలిసి పైకి రావటం మొదలుపెట్టారు. 15నిముషాలు పైగా గడుస్తున్నా కూడా వాళ్ళ అరుపు మాత్రం ఆగిపోలేదు. పక్క గది తలుపు దెగ్గరికి వచ్చిన ఓనర్ , "నేను వచ్చాను" అని చెప్పటానికి "అమ్మా" అని పిలిచాడు. అంతే , మొగ గొంతు వినపడటం తోనే ఆ దొంగ మళ్ళి వచ్చాడనుకొని మళ్ళి వీళ్ళు గట్టిగా అరిచారు. అతని మాటలు పూర్తి కూడా కాలేదు మరి. అక్కడ పరిస్థితి ఎలా వుందంటే, మొగ గొంతు విని వీళ్ళు  భయపడితే, వీళ్ళ అరుపు విని వాళ్ళు భయపడిపోయారు. ఆ ఓనర్ అతన్ని ఫాలో చేస్తూ పైకి వస్తున్న మిగితా అమ్మాయిలు వీళ్ళ అరుపులు వున్నపలంగా ఎక్కువ అవ్వటం తో ధమాలున ఒక్క ఉదుటున వాళ్ళ గదుల్లోకి వెళ్లి తలుపేసుకున్నారు. ఖచ్చితంగా ఏవరో పోయే వుంటారు , లేకపోతె ఇంతలా ఎందుకు అరుస్తారు. ఇలా వున్నాయి వాళ్ళ ఆలోచనలు. నేనేమో పక్కనే వుండి కూడా ఎందుకు అరుస్తున్నారో కూడా తెలియకుండా బిక్కమొహం వేసుకొని చూస్తున్నాను. నా పక్కనే వున్న ఇద్దరు అమ్మాయిలు (పక్క గది వాళ్ళు) నేను కలిసి ఇంక లాభం లేదనుకొని , ఆపండి తల్లులు అసలు ఎందుకు అరుస్తున్నారో కాస్త చెప్పండి అని గద్దిస్తే అప్పుడు వాళ్ళు దొంగ విషయం చెప్పారు. ఇంక అప్పుడు మాకు విషయం అర్ధం అయి , తల్లీ ఇందాక వచ్చింది దొంగ కాదు, ఓనర్ అని కాస్త ఆ అరుపు లాంటి ఏడుపు ఆపితే వాళ్ళని పిలుస్తామని చెప్పాము. అప్పుడు వాళ్ళు కాస్త శాంతించారు. డోర్ బయటనే కాపలా కాస్తున్న అతను మేము తలుపు తీయగానే లోపలకి వచ్చాడు. అయన కాస్త సర్ది చెప్పి, భయపడకండి , నేను వున్నాను అని చెప్పి వాళ్ళని సముదాయించాడు. చాలా సేపటి వరకు పాపం అతను అక్కడే కూర్చున్నాడు. అసలు వాళ్ళు ఎంతలా భయపడిపోయారంటే వాళ్ళ నీడని చూసినా భయపడిపోయే అంత. అసలుకే ఆరోజు వాళ్ళకి ఫైనల్ ఫైనల్ exam . (అంటే లాస్ట్ పేపర్ లెండి). ఇంక వాళ్ళు పరీక్షకి వెళ్ళటానికి కూడా బయపడిపోతుంటే ఫ్రెండ్స్ వెంట తీసుకొని వెళ్లి వచ్చారు. 


మరుసటి రోజు దాని ఎఫ్ఫెక్ట్ ఎలా వుందంటే, వాళ్ళ అరుపులేమో ఆ వీధి చివరి వరకు వినపడితే, హాస్టల్ లో వున్న అమ్మాయిలను విపరీతంగా భయపెట్టాయి. బయటికి వెళ్తే చాలు, అందరూ "అరె, ఏమైంది రాత్రి మీ హాస్టల్ లో, చాలా పెద్ద అరుపులు, కేకలు వినపడ్డాయి" అని అడిగేవాళ్ళు. ఇంక హాస్టల్ లో అమ్మాయిలేమో బాత్రూం కి వెళ్ళటానికి కూడా భయపడేవాళ్ళు. ఇదంతా ప్రత్యక్షంగా చుసిన నేను మాత్రం తలుచుకున్నప్పుడల్లా నవ్వుతూనే వుంటాను.

Saturday, June 30, 2012

పిల్లలు కాదు పిడుగులు


ఈ కాలం పిల్లల్ని చూస్తే అబ్బ వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అని ఎవరికైనా అనిపిస్తుందేమో. నా కొడుక్కి 6 సం వయస్సు, కానీ వాడు అడిగే ప్రశ్నలు చుస్తే చాల ఆశ్చర్యం వేస్తుంది నాకు ఒక్కోసారి. ఒక్కోసారి నవ్వు కూడా వస్తుంది అనుకోండి.


ఒకసారి నేను గులాబ్ జామున్స్ ఫ్రై చేస్తున్నాను. వాడు నా పక్కకు వచ్చి నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అన్నాడు. అప్పుడు నేను వద్దు నాన్న ఇది ఆయిల్, చాల వేడిగా వుంటుంది. అది మీద పడితే చాల డేంజర్ అన్నాను. అప్పుడు వాడు మరి మనమే అందులో పడితే? అని అడిగాడు. అప్పుడు నేను మనం వెంటనే emergency కి వెళ్ళాలి అన్నాను. అప్పుడు వాడు "మమ్మీ ఇప్పుడు గులాబ్ జామున్ కూడా emergency  కి వెల్లాల ?" అని అడిగాడు. ఇది జరిగినప్పుడు వాడి వయసు 4yrs . ఇది తలుచుకుంటే ఇప్పటికి నాకు నవ్వొస్తుంది.

వయసు పెరిగే కొద్ది తెలివి తేటలు కూడా పెరుగుతాయి కదా. మా పాపకి 2yrs. ఈమధ్య ఒకసారి మా బాబుతో నువ్వు చెల్లి కన్నా 4yrs పెద్ద కదా అందుకే నువ్వు 4టైమ్స్ ఎక్కువ తినాలి అన్నాను. అప్పుడు వాడు ఐతే నువ్వు నాకన్నా 25టైమ్స్ ఎక్కువ తింటున్నావా మమ్మీ అని అడిగాడు. ఈసారి మాత్రం నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. నేను ఎప్పుడైనా చెల్లి నీకన్న చిన్నది కదా దాన్ని బాగా చూసుకోవాలి తిట్టకూడదు, కొట్టకూడదు అని చెప్పాననుకోండి నేను కూడా నీకన్నా చిన్నవాడినే కదా, మరి నువ్వెందుకు నన్ను తిడతావు  అంటాడు. నువ్వు చెప్పిన మాట విని good boy లాగా వుంటే నేను ఎందుకు తిడతాను నాన్న అంటే, మరి చెల్లి కూడా నేను చెప్పినట్టు వింటే నేనెందుకు కొడతాను మమ్మీ అంటాడు . ఈ వయసులో ఆ తెలివితేటలకి నవ్వాలో, అతి తెలివితేటలని బాధ పడాలో అర్ధం కాదు. ఆలోచిస్తే వాడి వాదనలోను పాయింట్ వుంది కానీ వాడు అన్నట్టు "చెప్పినట్టు వినటం" లోనే వుంది తిరకాసు అంతా.

 ఇంట్లో ఇద్దరు పిల్లలు వున్నప్పుడు గొడవలు, కొట్లాటలు మాములే అనుకున్నా మా పాప రెండు సంవత్సరాల వయసు నుంచే మొదలు పెట్టింది కొట్టుకోవటం. ఎటువంటి ఆదరణకి నోచుకోని బొమ్మలు ఎన్నో toy box లో అలానే వున్నా పరవాలేదు కానీ ఒక బొమ్మ చెల్లి తీసుకొని ఆడుకోవటం మొదలు పెట్టిందంటే అప్పటికప్పుడు దాని మీద ప్రేమ పుట్టుకొస్తుంది , అది నా  బొమ్మ నేను ఆడుకోవాలి, చెల్లి షేరింగ్ చేసుకోవటం లేదు అంటూ కంప్లైంట్స్ మొదలవుతాయి . చెల్లి కూడా అంతే అనుకోండి. ఎవరికీ ఎవరు తక్కువ కాదు. నాకు తెలిసినంత వరకు ఇద్దరు (లేదా ఎక్కువ ) పిల్లలు వున్న ప్రతి ఇంట్లోనూ ఇది సర్వ సాధారణం. కానీ మనం ఎప్పుడైనా మన తల్లి తండ్రులు ఏదైనా పని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు చేయటం లేదు, నువ్వూ ఇలానే చేస్తున్నావు కదా లాంటి ప్రశ్నలు వేసామా? అలా అడిగిన తక్షణం వాళ్ళ చేయి మన చెంప మీద వుండటం తధ్యం. కానీ మా వాడు ఎక్కువ సేపు టీవీ చూడొద్దు నానా అంటే మరి నువ్వు చూస్తున్నావు కదా అంటాడు టక్కున. రెండేళ్ళు వయసున్న నా కూతురు మొబైల్ తీసుకొని vedios ఓపెన్ చేసి చూస్తూ వుంటుంది. దానికి pause  చేయటం, vedio నచకపోతే దాన్ని తీసేసి వేరే vedio పెట్టుకోవటం ఇలాంటివన్నీ తెలుసు. కొన్ని కొన్ని ఆటలు కూడా ఆడుకుంటుంది. నా కొడుకు already వున్న గేమ్స్ నచ్చక పోఇన కొత్త అట ఆడాలన్న మూడ్ వచ్చిన వెంటనే app store కి వెళ్లి వాడికి కావాల్సిన గేమ్ సెర్చ్ చేసి password ఎంటర్ చేయటానికి నా దెగ్గరికి తీసుకొస్తాడు. password  ఆప్షన్ లేకపోతె అదికూడా వాడే చేసేవాడే. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అనుకోవటానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేను ఇవన్ని ఒక్క మా పిల్లల గురించి మాత్రమే చెప్పట్లేదు. ఈ కాలం లో ఏ తల్లి ని కదిలించినా ఇలాగే మాట్లాడుతుంది అని నా strong feeling.

ఐతే నేను చూసినంత వరకు చిన్న పిల్లలుగా వున్న మనకి, మన పిల్లలకి మద్య తేడాలు తక్కువే. కాకపోతే మనం 6yrs వయసులో చేసిన పనిని మన పిల్లలు 2yrs వయసులోనే చేస్తున్నారు. వీళ్ళకు వున్నన్ని facilities , resources మనకి వుంటే మనం కూడా ఇలానే వున్దేవాల్లమేమో. కానీ మన తల్లి తండ్రులకి , తల్లి తండ్రులుగా మనకి (ఈ కాలం parents కి ) మాత్రం చాల తేడా వుంది. ముక్యంగా మన తల్లి తండ్రులకి సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా వుండేది. వాళ్ళ వాళ్ళ feelings ని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళు. మనం మన పిల్లల మీద చూపించే ప్రేమ కి మన తల్లి తండ్రులు మన మీద చూపించే ప్రేమ కి చాల తేడ వుంటుంది. నేను చెప్పేది ప్రేమలో తేడా వుంది అని కాదు, ప్రేమ చూపించటం (express చేయటం )లోనే తేడా వుంది అని. వాళ్ళు వాళ్ళ ప్రేమని అంతా మనసులోనే దాచుకొని మనల్ని మంచి మనుషులుగా తీర్చి దిద్దాలంటే ఎలా వుండాలో , ఎంత వరకు ప్రేమ చూపిస్తే మనకు ప్రేమ, భక్తీ , భయం ఉంటాయో అంతవరకే చూపించేవాళ్ళు. ఆ విషయం లో వాళ్ళని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలిగే వాళ్ళు. అది ఈ కాలం తల్లి తండ్రుల్లో తక్కువే అని నా ఫీలింగ్. (ofcourse , నా opinion మాత్రమే). మన parents లో లేని మనలో వున్న మరొక ముక్యమైన ఫీలింగ్ 'status'. దానికోసం కూడా మనల్ని మనం అంతగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మన తల్లితండ్రులు పిల్లలకి సుఖాలతో పాటు కష్టాలు కూడా తెలియాలి అనుకునేవాళ్లు. కనీసం కష్టాలని సృష్టించక పోఇన వాటిని ఎదురుకోవటం , అది కూడా మన జీవితం లో బాగమే అని కొన్ని అనుభవాల ద్వారా చెప్పటానికి ప్రయత్నిచేవాళ్ళు. కానీ మనం, మన పిల్లలు చిన్న అసౌకర్యానికి గురి ఐనా వాళ్ళ కన్నా మనమే ఎక్కువ బాధ పడి పోతాము. ఆ సమస్యని సాధించటానికి వాళ్ళ కన్నా మనమే ముందుంటాం. ఇంకా వాళ్ళకి నేర్పటానికి అవకాశం ఎక్కడిది?  నాకు ఐదేళ్ళ వయసున్నప్పుడే నేను రెండు వీధుల అవతల వున్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి అడుకోనేదాన్ని. కానీ ఈ రోజుల్లో పక్కింటికి వెళ్లి ఆడుకోవటానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇండియాలో ఈ విషయం లో కొంచెం బెటర్ అనుకుంట. చిన్న చిన్న పిల్లలు కూడా సిటీ బస్సు ఎక్కి స్కూళ్ళకి వెళ్తున్నారు. కానీ ఏ మాత్రం అవకాశం వున్నా అలా చేయటానికి తల్లితండ్రులు నిరాకరిస్తారని నా అభిప్రాయం. తప్పనిసరి పరిస్తుల్లోనే అలా పంపించినా కూడా చిన్నప్పటినుంచే లోకాన్ని చదవగల తెలివితేటలు ఖచితంగా వాళ్ళ సొంతం అవుతాయి . కానీ అమెరికా లో మాత్రం కనీసం 12yrs వచేవరకు పిల్లల్ని వంటరిగా వదలకూడదు. చివరకి వాళ్ళు play ground కి వెళ్లి ఆదుకోవాలన్న కూడా parents పక్కన వుండాల్సిందే.  ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉంటాయి. కాకపోతే నాకు వున్న టైము, ఓపిక తక్కువే కాబట్టి ఇంతటితో "పిల్లలు కాదు పిడుగులు" శీర్షిక సమాప్తం :-)



Saturday, June 9, 2012

డేటింగ్


డేటింగ్ అనగానే టైటిల్ చూసి నేను చాల మోడ్రన్ అమ్మాయి ని అని అనుకోకండి. నేను అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయినే. ఐతే ఈ పదం వినగానే మన ఆలోచన ఎలా వుంటుందో తెలియంది కాదు నాకు. అందుకే ముందుగా ఈ explanataion.

మాకు ఎంగేజిమెంట్ కి పెళ్ళి కి మద్య సరిగ్గా 2 నెలలు గ్యాప్ వచ్చింది. అప్పుడు నేను హైదరాబాద్ లోని ఒక చిన్న కంపెనీ లో జాబ్ చేసేదాన్ని. మా అయన వాళ్ళ ఇళ్ళు (పెళ్ళికి ముందు) మా ఆఫీసు కి దెగ్గర్లోనే వుండేది. మా ఇంటికి ఆఫీసు కి మాత్రం గంటన్నర ప్రయాణం. ట్రాఫిక్ ఎక్కువగా వుండే టైం లో ఐతే 2 గంటలు పట్టేది, జస్ట్ వెళ్ళటానికే. సాయంత్రం 6 గంటలకు ఆఫీసు టైం ఐపోగానే నేను వేరే software నేర్చుకోవటానికి ఆఫీసు కి దెగ్గర్లోనే ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేదాన్ని. రాత్రి 8కి క్లాసు అయిపోగానే బయలుదేరితే ఇంటికి వెళ్లేసరికి రాత్రి 9.30 అయ్యేది. పాపం నాకోసం మా డాడీ బస్ స్టాప్ లో ఎదురు చూస్తూ వుండేవారు. నేను బస్సు దిగగానే, ఇద్దరం కలిసి ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇలా నా రోజులు నడుస్తున్న రోజుల్లో నాకు పెళ్లి నిశ్చయం అవ్వటం, అబ్బాయి వాళ్ళ ఇళ్ళు మా ఆఫీసు కి దెగ్గర్లో వుండటం యాద్రుచికంగా జరిగిపోయాయి.

అందరు ఆడపిల్లల తండ్రుల లాగానే మా డాడీ కూడా ఎప్పుడు ఒక మాట చెప్పేవారు. పెళ్లి అయ్యేంతవరకు అబ్బాయి తో ఎక్కువగా మాట్లాడకూడదు, కలిసి ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు లాంటివన్నమాట. ఈ విషయం లో మా డాడీ అందరికన్నా కొంచెం ఎక్కువ అనే చెప్పాలి. ఫోన్ లో కూడా మాట్లాడనిచేవారు కాదు. మరి మనం తల్లి తండ్రులు చెప్పినట్టుగా చేస్తే పిల్లలం ఎందుకు అవుతాము చెప్పండి.

నా ఆఫీసు అయిపోయి బయటికి వచేసరికి మా అయన ఆఫీసు బయట నాకోసం ఎదురు చూస్తూ వుండేవారు. అక్కడినుంచి నన్ను కోచింగ్ సెంటర్ కి తీసుకెళ్ళి డ్రాప్ చేసేవారు. నా క్లాసు ఐపొఇ బయటికి వచేవరకు బయటనే ఎదురు చూసేవారు. నేను బయటికి రాగానే  బైక్ మీద కాసేపు షికార్లు, అంటే చిన్న చిన్నవే లెండి. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళటం, కాసేపు తింటూ ఏదైనా మాట్లాడుకోవటం,అక్కడినుంచి అయన నన్ను బైక్ మీద మా ఇంటికి కొంచెం దూరం లోని ఒక బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. నేను అక్కడినుంచి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళేదాన్ని. చాలా దూరం బైక్ మీదనే రావటం వల్ల మేము రెస్టారెంట్ లో గడిపిన టైం కాస్తా ఇక్కడ అడ్జస్ట్ అయ్యేది. అందుకే మా డాడీ కి ఎప్పుడు అనుమానం కూడా వచ్చేది కాదు. మద్య మద్యలో మా డాడీ కాల్ చేస్తే నేను బస్సు లో వున్నానని తేలిగ్గా అబధం చెప్పేదాన్ని.  ఇప్పటికీ మా అయన ఒక్కోసారి పాత జ్ఞాపకాలు నెమరేసుకునేటప్పుడు, ఎక్కడున్నావమ్మా అని అడిగితె బస్సు లో వున్నాను డాడీ అని అబద్దం చెప్పేదానివని అట పట్టిస్తుంటారు.

అంతేనా, నేను ఆఫీసు కి చాల ఉదయాన్నే బయలుదేరుతుండటం  వల్ల (9 కల్ల ఆఫీసు లో వుండాలి కదా మరి) క్యారేజి కూడా ఎక్కువగా వంటలు వండి తీసుకెళ్ళటానికి కుదిరేది కాదు. ఒక్కటే కూర , అన్నం తీసుకొని వెళ్ళేదాన్ని. నేను ఇంటి నుండి బయలుదేరినప్పటి నుంచి ఫోన్ మొదలుపెడితే ఆఫీసు కి వెళ్ళేదాకా మాట్లాడుతూనే వుండటం వల్ల అయన తరుచు న బాక్స్ గురించి కూడా అడిగేవారు. నేను ఒక్కటే కూర అని చెప్తే చాలా ఆశ్చర్య పోయేవారు. (వాళ్ళింట్లో కనీసం 2 కూరలు లేకుండా లంచ్ అవ్వదు మరి). ఒకరోజు లంచ్ టైం లో అయన ఆఫీసు కి రావటం చూసి నేను ఆశ్చర్యంతో ఏమిటి విషయం అని అడిగితే వాళ్ళ అమ్మ చేత వంట వండించుకొని 2 కూరలు, రసం, పెరుగు అన్ని పెట్టుకొని పెద్ద బాక్స్ తీసుకోచారు. అప్పుడు ఆశ్చర్య పోవటం నా వంతు ఐంది. అలా అప్పుడప్పుడు లంచ్ టైం లో కూడా దర్శనం ఇస్తుండేవారు.

ఇంతా చేస్తే మేము కలుసుకొనే టైం చాలా తక్కువనే చెప్పాలి. ఆఫీసు వుండేది వారానికి 5 రోజులే కదా మరి. పైగా నేను మ్యారేజ్ కి నెల ముందు జాబ్ మానేసాను, అంటే ఖచితంగా దొరికిన టైం 4 వారాలు మాత్రమే.

ఇప్పటికి పెళ్లి అయి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ మద్య మా ఆఫీసు లో ఏదో discussion వచినప్పుడు నేను మా కొలీగు తో ఇండియా లో డేటింగ్ అనేది ఉండదని, చాలా వరకు అరెంజేడ్ మ్యారేజ్ మాత్రమే ఉంటాయని గొప్పగా చెప్పాను. అప్పుడు అయన చాలా ఆశ్చర్యపొయి, నిజామా? నువ్వు పెళ్ళికి ముందు ఆయన్ని ఎప్పుడు కలవలేదా? అని అడిగాడు. అప్పుడు  నేను పెళ్లి సెటిల్ ఐన తరవాత కలిసామాని జరిగింది చెప్పాను . అప్పుడు అయన "that is called dating" అన్నాడు.  అప్పుడే మా కాబిన్ లోకి వచ్చిన మా మేనేజర్ (దాదాపు 60 సంవత్సరాలు వుంటాయి) మా discussion విని, "all the kids around the world are same" అనేసింది. అక్కడ కూడా తల్లి తండ్రులకి చెప్పకుండా చాలా చేసేస్తారు అనే వుదేస్యం తో. ఇదంతా పెళ్లి కన్ఫాం అయ్యాకే అని ఆవిడకి explanation ఇచుకోవాల్సి వచ్చింది.

Wednesday, June 6, 2012

నా మొదటి అమెరికా ప్రయాణం


దాదాపు 6సం క్రితం, మా బాబు కి 4 నెలలు. మా బాసు (అంటే మా వారు) అప్పటికే అమెరికా వెళ్లి 6 నెలలు ఐంది. ఇంకా నేను ఆయన్ని వదిలి ఉండలేను అని, వెంటనే అమెరికా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. టికెట్ ఎలాగో కంపెనీ వాళ్ళు బుక్ చేస్తారు కాబట్టి నాకు , బాబు కి వెంటనే , వీలైనంత తొందరగా టికెట్స్ బుక్ చేయమని ఆఫీసు లో చెప్పాను. నేను తొందరగా అన్నాను కదా అని ఆఫీసు వాళ్ళు కూడా 20 రోజుల్లో ప్రయాణం అని టికెట్స్ బుక్ చేసి చేతిలో పెట్టారు. ఆ ప్రయాణం ఎలా వుందంటే : హైదరాబాద్ to Malaysia, Malaysia to Los Angeles , Los  Angeles to San Francisco. ఇది క్లుప్తంగా.

ఇక టికెట్స్ బుక్ అయ్యాయి కదా అని షాపింగ్ స్టార్ట్ చేశాను. అప్పట్లో నాకు షాపింగ్ చేయటానికి తోడు  ఎవరు లేకపోవటంతో మా అన్నయ్య ని తీసుకొని చెప్పులు కొన్నుక్కోవటానికి వెళ్ళాను. జనరల్ గ బోయ్స్ కి ఎక్కువ సేపు షాపింగ్ చేయటానికి ఇష్టం వుండదు కదా, అందుకని ఏవో రెండు మూడు జతలు చూసి, కొంచెం tight గ వుండి  చూడటానికి బానే వున్న shoe లాంటి చెప్పుల జత ఒకటి సెలెక్ట్ చేసి మా అన్నయ్య ఒక 2,3 టైమ్స్ వేస్తె అదే అడ్జెస్ట్  అవుతుంది అని చెప్పి నా  చేత ఆ చెప్పుల జత కొనిపించాడు. ఇంకా నేను ఒక్కదాన్నే, బాబుని తీసుకొని జర్నీ చేయాలి కదా అందుకని బేబీ క్యారీ బాగ్ ఒకటి కొన్నాను. బాబు ని ఈజీ గా క్యారీ చేయొచ్చు అని.

చివరకి జర్నీ డేట్ రానే వచ్చింది. కనీసం గంట తరవాత ఏమి జరుగుతుందో, ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో కూడా అలోచిందే అలవాటు లేని నేను బాబు కోసం కొంచెం పాల పొడి, కొంచెం సెరెలాక్ వేసుకొని బయలుదేరాను. కొత్తది ఏది కొన్న వెంటనే ధరించే అలవాటు వున్న నేను, కొత్త shoe కూడా వేసుకొని బయలుదేరాను. ఒంటరిగా, బాబుని తీసుకొని. 

కొత్త చెప్పులు కొంచెం tight  గా వున్నాయని ముందే చెప్పాను కదా,  Malaysia వెళ్లేసరికి చెప్పులు కరవటం మొదలు పెట్టి, నడవటానికి నరకం కనిపించటం మొదలు పెట్టింది. ఇంక నా కొడుకేమో ఫ్లైట్ ఎక్కినప్పటినుంచి ఒకటే ఏడుపు. LA లో ల్యాండ్ అవ్వటానికి గంట ముందు I-94 ఫోరం ఇచ్చారు.( అమెరికా లో దిగిన తరవాత Arrival-Departure Record కోసం అక్కడికి వెళ్ళే ప్రతీ వాళ్ళు submit చేయాల్సి వుంటుంది). ఐతే ఈ ఫోరం ప్రతి మనిషి individual గ నింపాల్సి వుంటుంది. కానీ నాకు  Air Hostess ఒక్కటే  ఫోరం ఇచ్చి ఫిల్ చేయమని చెప్పింది. నేను ఒక్కటే ఇచ్ఛావేంటి అని అడిగితే ఒక్కటి చాలమ్మ అని చెప్పింది. కానీ నాకు మా అయన అవి రెండు ఇస్తారు అని చెప్పారు ఫ్లైట్ ఎక్కేముందు. ఆమె అలా చెప్పేసరికి, సరేలే ఆయనే పొరబడి వుంటారు అనుకోని ఆ ఒక్క ఫోరం నింపి వేశాను. చివరకి చిన్న చిన్న కష్టాల్ని తప్పించుకొని ఎలాగో LA (Los Angeles ) చేరేసరికి ఫ్లైట్ 2hrs లేట్. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాకు port of  entry (అంటే అమెరికా లోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అన్నమాట) LA  ఇచ్చారు కాబట్టి నేను LA లో దిగి నా luggage అంత తీసుకొని అక్కడినుంచి లోకల్ ఫ్లైట్ ఎక్కాలి. luggage  కూడా లోకల్ ఫ్లైట్ లోకి మార్చాలి.

నేను LA లో దిగి తరవాతి ఫ్లైట్ ఎక్కటానికి నాకు వున్న టైం కరెక్ట్ గ 2 గంటలు. ఐతే LA  కి వెళ్లేసరికి ఫ్లైట్ రెండు గంటలు లేట్ అని చెప్పాను కదా. అక్కడ దిగి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కాల్సిన వాళ్ళను అందరిని immigration దెగ్గర కలవమని వాళ్ళకు అందరికి మేము నెక్స్ట్ ఫ్లైట్ కి టికెట్స్ ఇస్తామని చెప్పారు. పోనీలే వాళ్ళు టికెట్స్ ఇస్తారు కదా అని వాళ్ళని జాగ్రతగా ఒక కంట కనిపెడుతూ luggage తీసుకొని కార్ట్ లో పెట్టుకొని (25+25=50kgs luggage) క్యారీ బాగ్ లో బాబు  ని కూర్చో పెట్టుకొని కష్ట కష్టంగా కార్ట్ ని తోసుకుంటూ  immigration  దెగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆ ఆఫీసర్, అమ్మా  ఒక్క ఫోరం సరిపోదు, నువ్వు ఇంకోటి కూడా మీ బాబు కోసం ఫిల్ చేయాలి అని చెప్పి ఇంకో ఫోరం చేతిలో పెట్టాడు. అక్కడే నిలబడి దాన్ని ఫిల్ చేయటానికి ట్రై చేస్తున్నాను, ఇంకో పక్క నా  కొడుకు ఒకటే ఏడుపు లంకించుకున్నాడు. దానితో నాకు ఫోరం ఫిల్ చేయటం చాల కష్టం ఐపోయింది. నా కష్టాన్ని చూసిన immigration ఆఫీసర్, నాకు ఇవ్వమ్మా నేను నింపుతాను నీకోసం అన్నాడు. హమ్మయ అనుకోని అయన చేతిలో ఫోరం పెడితే అయన గబగబా ఫిల్ చేసి నా పని పూర్తి చేసి passports చేతిలో పెట్టాడు. హమ్మయ అనుకోని వెనక్కి తిరిగి చూదును  కదా, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క నిమషం నా గుండె కొట్టుకోవటం ఆగిపోయిందంటే నమ్మండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్ గురించి ఎవరిని అడగాలి.

సరే ఇంకా అక్కడే ఎలాగో ఉండలేము కదా అని అక్కడ directions చదువుతూ airport బయటికి వచ్చాను. అక్కడ ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఒకటి కనిపించింది. హమ్మయ అనుకుంటూ అక్కడికి వెళ్లి San Francisco కి వెళ్ళాల్సిన ఫ్లైట్ వెళ్ళిందా అని అడిగాను. ఒకవేళ పొరపాటున నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఇంకా వెళ్ళకపోతే పరిగెత్తుకు వెళ్లి అదే ఎక్కేదాము అని.  ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నాకు అమెరికా రాకముందు ఎప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసే అలవాటు వుండేది కాదు. కాబట్టి నాకు వీళ్ళ accent గురించి అస్సలు ఐడియా లేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ కౌంటర్ దెగ్గరికి వెళ్తే, నేను అడిగింది ఆమెకి ఏమి అర్ధం అయిందో తెలియదు కానీ, "I dont Know " అనేసింది. ఏడ్చినట్టుంది, ఇన్ఫర్మేషన్ కౌంటర్ లో వున్నా మనిషి నాకు తెలియదు అనటం ఏమిటో నాకు అర్ధం కాలేదు. సరే కనీసం Malaysian Airlines కౌంటర్ ఎక్కడ వుందో చెప్పు తల్లి అని అడిగాను. ఆమె 4th  ఫ్లోర్ లో వుంది అని చెప్పి, లిఫ్ట్ దెగ్గరికి ఎలా వేళ్ళలో చెప్పింది. ఇక్కడ గుర్తుంచు కోవలసిన విషయం ఏంటంటే, నా ముందు luggage , నా క్యారీ బాగ్ లో బాబు అలాగే వున్నారు. దానికితోడు కొత్త చెప్పుల పుణ్యమా ని నడవటమే చాల కష్టంగా వుంది. సరే ఇంకా నేను 4th ఫ్లోర్ కి వెళ్ళాలి కదా అని లిఫ్ట్ దెగ్గరికి వెళ్ళాను. ఆ లిఫ్ట్ ని చూసేసరికి నాకు ఒక విషయం అర్ధం ఐంది. అంత luggage వెంటేసుకొని పైకి వెళ్ళటం కష్టం అని. మళ్ళి తిరిగి ఆ కౌంటర్ దెగ్గరికి వచ్చి ఆమెతో నా గోడు వేల్లబోసుకున్నాను. అప్పుడు ఆమె నా బాధ చూసి, అక్కడే వున్న ఒక employee ని చూపించి ఆమెతో చెప్పు, ఆమె airlines representative  ని కిందికి పిలిపిస్తుంది అని చెప్పింది. అబ్బ, చాల పెద్ద సహాయం చేసావు తల్లి అనుకోని ఆమె దెగ్గరికి వెళ్లి నేను పలానా మనిషి తో మాట్లాడాలి అని చెప్పాను. ఆమె సరే అని చెప్పి వెళ్లి 5 నిమిషాల్లో తిరిగి వచింది. అయన వస్తున్నాడు కాసేపు వెయిట్ చేయండి అని చెప్పింది. చెప్పినట్టుగానే 5 నిమిషాల్లో ఒక పర్సన్ వచ్చి "how can I help you?" అన్నాడు. ఆయనకి నా గోడంతా వెల్లబోసుకున్నాను. అయన సరే మేడం మీరు 5 నిముషాలు వెయిట్ చేయండి అని చెప్పి నాది, బాబుది పాస్పోర్ట్ట్స్ తీసుకొని వెళ్ళాడు. ఇచేతప్పుడైతే ఏమి ఆలోచించకుండా ఇచ్చాను కానీ అయన అవి తీసుకొని వెళ్ళినప్పటినుంచి ఒకటే టెన్షన్, అరె నేను అలా ఇచేసానేంటి, అవి అసలే పాస్స్పోర్ట్స్ , వెళ్ళిన వాడు వస్తాడ రాడా , రాకపోతే ఏమి చేయాలి, అవి లేకుండా ఎక్కడికి వెళ్ళాలి... ఇలా వుంది నా మనసు లో టెన్షన్. ఎంత టెన్షన్ అంటే చేతిలో పిల్లాడు వున్నాడు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అక్కడే కూర్చొని బావురుమని ఎద్చేసేదాన్ని. ఇప్పుడు నేను ఏడిస్తే వాడు ఏమైపోతాడు, అసలే బయలుదేరినప్పటినుంచి వాడు ఒకటే ఏడుపు. చివరకి 5 నిమిషాల్లో వస్తాను అన్నవాడు కాస్తా 20 నిముషాలు వెళ్ళాడు. అతన్ని చూడగానే నాకు పోఇన ప్రాణం తిరిగి వచినంత పని ఐంది. పాపం నాకు, నా కొడుక్కి SFO (San Francisco ) కి 2 టికెట్స్ తీసుకొని వచాడు. టికెట్స్ చేతిలో పెట్టి, అక్కడే నా luggage కూడా తీసుకున్నాడు. మేము ఇక్కడే ఫ్లైట్ లో వేస్తాము లేమ్మా అని. అక్కడినుంచి నేను డొమెస్టిక్ airport కి వెళ్ళాలి. అది పక్కనే, ఒక 5 నిముషాలు నడవాలి. కాకపోతే ఇక్కడ జనాలు ఊరికే నడవటానికి ఇష్టపడరు కనుక అంత తక్కువ దూరానికి కుడా బస్సు సౌకర్యం వుంది. (airport లో టైం కూడా ముక్యమే లెండి). నాకు నడవటం సమస్య కాదు కానీ నా చెప్పులు అప్పటికే నాకు అన్ని రంగులు చూపించి వేసాయి కదా, ఇంకా నడిచే ఓపిక లేదులే అని కాసేపు బస్ స్టాప్ లో ఎదురు చూసాను. అసలే దురద్రుష్టాన్ని నాతో వెంటేసుకొని మరీ వచాను కదా, పైగా నాకు నెక్స్ట్ ఫ్లైట్ కి కరెక్ట్ గ గంట మాత్రమే టైం వుంది. ఇంకా ఎదురుచూసే దైర్యం లేక నేనే చిన్నగా నడక ప్రారంభించాను. అలా బయలుదేరానో లేదో, బస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ స్టాప్ లో తప్ప మద్యలో బస్ ఆపరు కనక నాకు బస్ ఎక్కే బాగ్యం దక్కలేదు. ఇక వేరే దారి లేక టెర్మినల్ దాక నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ మళ్ళి చెకప్ అని, అదని ఇదని ఫార్మాలిటీస్ అన్ని పూర్తయేసరికి ముప్పావుగంట. ఇంకో పక్క మా అయన నాకోసం SFO aiport లో వెయిట్ చేస్తున్నాడు కదా. మరి ఆయనకి విషయం చెప్పటానికి నాకు ఇంతవరకు అవకాశమే దొరకలేదు. సరే ఇంక అన్ని సమస్యలు తీరిపోయాయి కదా అని పబ్లిక్ బూత్ నుండి ఫోన్ చేశాను. పాపం అప్పటికి నా దేగ్గరి నుండి ఫోన్ రాకపోయే సరికి చాలా కంగారు పడుతున్నారు. నేను ఎక్కువ విషయాలు చెప్పకుండా ఫ్లైట్ ఆలస్యమైందని ఇంకో గంటలో అక్కడ ఉంటానని చెప్పి పెట్టేసాను.

కరెక్ట్ గా గంట తరవాత ఫ్లైట్ SFO లో దిగి, నేను డొమెస్టిక్ luggage సెక్షన్ కి వెళ్ళాను. మళ్ళి అక్కడ రెండు సూట్కేసులు తీసుకొని కార్ట్ లో వేసుకోవాలి కదా అని అక్కడ నిలబడి వాటికోసం చూస్తున్నాను. ఇంతలో నా వెనక నుండి ఎవరో బుజం మీద చెయ్యి వేసారు. భయంతో వెనక్కి తిరిగి చుస్తే మా వారు. అబ్బ, నిజం చెప్తున్నాను ఆయన్ని చూడగానే నాకు సాక్షాతూ భగవంతుడే ప్రత్యక్షం అయి "బాలికా నీవు తప్పుకో, నీ కష్టాన్ని తీర్చటానికి నేను వచేసానుగా" అని అనిపించిందంటే నమ్మండి.  ఇంక ఆ బరువులు, బాద్యతలు ఆయనకి ఇచేసి నేను నేరుగా వెళ్లి కారులో కూర్చున్నాను. ఆ ప్రయాణం దెబ్బకి మళ్ళి ఒంటరిగా వెళ్ళాలంటే బయమేసి 5 సంవత్సరాలు నేను తిరిగి ఇండియా వెళ్లలేదంటే నమ్మండి. అయన వస్తేనే గాని నేను వెళ్ళేది లేదని భీస్మిన్చుక్కుర్చన్నాను.

ఇదండీ నేను జీవితం లో ఎప్పటికి మర్చిపోలేని అనుభవం. ఇప్పుడంటే చాల రోజులైంది కాబట్టి మానేసాను కానీ, అమెరికా వచ్చిన రోజుల్లో ఐతే కనిపించిన ప్రతివాళ్ళకి కూర్చోబెట్టి మరీ చెప్పేదాన్ని నా ఈ కష్టాల్ని. ఇప్పుడు తలచుకుంటే చాల నవ్వొస్తుంది నాకు. అసలు ఇంకో విషయం తెలుసా నేను ఇంటికి వచ్చిన తరువాత చేసిన మొదటి పని ఆ చెప్పులని తీసి అవతల పారేయటం. మల్లీ జన్మలో టైట్ గా వుండే చెప్పులు కొనకూడదు అని నిర్ణయిన్చుకున్నాను. చెప్పులు అనేవి అందంగా వుండటం కన్నా సౌకర్యంగా వుండటం ముక్యం అని నేర్చుకున్నాను. ఇదీ కథ.

Tuesday, June 5, 2012

నేను కూడా మొదలు పెట్టేసానోచ్...


దాదాపు 3 సంవత్సరాల క్రితం ఈనాడు లో నెమలికన్ను మురళి గారి బ్లాగ్ చూసినప్పుడు నాకు మొదటిసారి బ్లాగ్ లోకం తో పరిచయం కలిగింది. అప్పటినుంచి నేను కూడా ఒక బ్లాగ్ మొదలుపెట్టాలని ఎన్నో సార్లు అనుకున్నాను కానీ చదవటానికి కూడా టైం సరిపోని పరిస్థిలో వున్న నాకు రాయటం అనేది అందని ద్రాక్ష గానే మిగిలి పోయింది. ఇదిగో ఇన్ని రోజుల తరవాత కాస్త టైం దొరికి, ఎలాగైఅతేనేం చివరకి మొదలు పెట్టేసాను. టైం లేదు అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నా నాకు, బ్లాగ్ create  చేయటానికి మాత్రం ఎక్కువ టైం పట్టలేదు.

బ్లాగ్స్ చదవటం మొదలు పెట్టినప్పటినుంచి నెమలికన్ను మురళి గారికి ఏకలవ్య శిష్యరికం చేస్తున్న నేను అయన రేంజ్ లో కాకపోఇన  కనీసం జనాలకు అర్ధం అయ్యే రేంజ్ లో ఐన టపాలు రాయగలనో లేదో చూడాలి. కనీసం రాయటానికి ప్రయత్నిస్తానని మాత్రం చెప్పగలను.

అన్నట్టు ఇందులో ఏమి రాస్తావు అని అడిగితె మాత్రం ఇది అని చెప్పలేను, ప్రస్తుతానికి నా ఆలోచనలు, అభిప్రాయాలూ, అనుభవాలు అని మాత్రం చెప్పగలను.