Wednesday, July 18, 2012

బాబోయి దొంగలు

మనకు తెలిసినంత వరకు దొంగలు దొంగతనానికే వస్తారు. కానీ దొంగతనం చేయటానికి వచ్చానని డైరెక్ట్ గా మనకి చెప్పటానికే వస్తే...

నేను P.G. చేసేటప్పుడు ఇంటికి దూరంగా వేరే ఊర్లో వుండాల్సి రావటం వల్ల లేడీస్ హాస్టల్ లో వుండేదాన్ని. మా హాస్టల్ ఆ వీధిలో చివర వుండేది. అంటే అది డెడ్ ఎండ్ అన్నమాట. మా గది సెకండ్ ఫ్లోర్ లో వుండేది. మా రూము కి ఆనుకొని ఇంకొక రూం కూడా వుండేది. రెండు రూముల్లోకి మద్య ఒక డోర్  వుండేది. మా రూం లో నాతో పాటు ఇంకో ఇద్దరు డిగ్రీ అమ్మాయిలు వుండేవాళ్ళు. నా  పక్క రూం లో మాత్రం ఇద్దరు ఫార్మసి అమ్మాయిలు వుండేవాళ్ళు. మామూలుగా డిగ్రీ వాళ్ళకి ముందుగా ఎగ్జామ్స్ ఉండేవి. మాకు ఆలస్యంగా, అందరికి అయిపోయాక ఉండేవి. అలా ఒకసారి వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఐపోయాక మాకు సెమిస్టరు ఎగ్జామ్స్ మొదలయ్యాయి. నాతో పాటు ఇద్దరు డిగ్రీ అమ్మాయిలు వుండేవాళ్ళు అని చెప్పాను కదా. వాళ్ళకి ముందే పరీక్షలు అయిపోవటం తో నా రూం మేట్స్ ఇద్దరు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే మిగిలాను, నా రూం లో.

మా రూం కి ఎప్పుడు క్లీన్ గా వుంటుంది అని ఒక మంచి పేరు వుండేది ఆ హాస్టల్ లో. కాబట్టి ఎప్పుడు వీలు కుదిరినా ఎవరో ఒకరు మా రూం లో పడుకోవాలని అవకాశం కోసం చూస్తూ వుండేవాళ్ళు చాలా మంది వేరే రూముల్లో వుండే అమ్మాయిలు. మా పక్క రూం చాలా పెద్దది అవ్వటం వల్ల , దాంట్లో ఏడుగురు అమ్మాయిలు వుండేవాళ్ళు. అందరూ  కూడా MCA చేస్తున్నారు. ఇప్పుడు రూం లో నేను ఒక్కదాన్నే వున్నాను కదా, వెంటనే వాళ్లలో ముగ్గురు అమ్మాయిలు నా గదిలో పడుకోవటానికి పర్మిషన్ అడిగారు. సరే నాకు కూడా తోడు వుంటుంది కదా అని సరే అన్నాను. అలా ఆరోజు రాత్రి నలుగురం అమ్మాయిలం మా గదిలో పడుకున్నాం. మరుసటిరోజు వాళ్ళకి exam వుండటం తో వాళ్ళు ముగ్గురూ నాలుగింటికి అలారం పెట్టుకొని పడుకున్నారు. అలా అనుకున్నట్టుగానే నాలుగింటికి ముగ్గురూ లేచి చదువుకుంటున్నారు.

అలా వాళ్ళు ముగ్గురూ లైట్లు వేసుకొని కిటికీలు తెరుచుకొని చదువుకుంటూ వుండగా  కిటికీ ఎదురుగా కూర్చున్న ఒక అమ్మాయికి కిటికీ దెగ్గర చిన్న అలికిడి ఐంది. ఎవరా అని ఆశ్చర్యపోతూ అటువైపు చూసింది. ఎవరో ఒక అబ్బాయి కిటికీ కి అనుకోని నిలబడి వీళ్ళనే చూస్తున్నాడు. నాకు నిద్ర విషయం లో ఒక అలవాటు వుంది. ఒకసారి గాఢ నిద్ర లోకి వెళ్ళిపోతే అంత తొందరగా లేవను. కాబట్టి అక్కడ జరిగే conversation లో నేను లేను, ఇంకా పడుకొనే వున్నాను. ఆ అమ్మాయి అతన్ని చూడగానే (లోపల భయపడుతూనే) "ఎవడ్రా నువ్వు" అని అడిగింది. అతను , "దొంగని" అని సమాదానం చెప్పాడు.

అమ్మాయి: ఇక్కడికి ఎందుకు వచ్చావు?
దొంగ:  దొంగతం చేయటానికి
అమ్మాయి: మర్యాదగా వెళ్ళిపో, లేదంటే అందరిని పిలుస్తాను
దొంగ: మీతో మాట్లాడాలి, తలుపు తియ్యవా ప్లీజ్
అమ్మాయి: ఏం  , పిచ్చి పిచ్చిగా వుందా ?
దొంగ: తలుపు తీస్తే ఎలా వుందో చెప్తాను
...
..

ఇలా వాళ్ళ సంభాషణ జరుగుతుండగా కిటికీ కి అటు పక్క ఇటు పక్క కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు ఆ దొంగ మొహం చూడటానికి కూడా భయపడుతున్నారు. బుక్ లోనుండి మొహం కూడా తిప్పకుండా వింటున్నారు. అలా వింటూ వింటూ వాళ్ళ భయం తారా స్తాయికి చేరేసరికి ఇంక ఆగలేక గట్టిగా అరవటం మొదలుపెట్టారు. వాళ్ళని చూసి మొదటి అమ్మాయి కూడా విపరీతంగా అరవటం మొదలు పెట్టింది. మాములుగా మాటలు అంటే వినపడవు కానీ మరీ అంత పెద్ద అరుపులు వినపడకుండా ఎలా వుంటాయి. వాళ్ళ అరుపుల్లాంటి కేకలకి పక్కనే బాంబు పడ్డంత భయంగా మెలకువ వచ్చింది నాకు. వీళ్ళు అరవటం మొదలు పెట్టగానే ఆ దొంగ కూల్ గా అక్కడినుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీ దెగ్గర ఎవరు లేరు. వీళ్లేమో ఒకటే అరుపు. ఆ అరవటం కూడా ఎంత భయంకరంగా వుందంటే నిద్రపోతున్న వాళ్ళని ఒక దయ్యం స్వయంగా నిద్ర లేపితే ఎలా వుంటుందో అలా వుంది. ఇంక నా ఆలోచనలు పరి పరి విధాలుగా సాగుతున్నాయి. ఏమైంది అని అడిగితే ముగ్గురిలో ఎవరూ  కూడా అరుపు ఆపరు , సమాదానం చెప్పరు. కిటికీ దెగ్గర చూస్తే ఎవరూ లేరు, కొంపదీసి పాముగాని వచ్చిందా అని చేద్దర్లు కూడా అన్ని కదిపి చూసాను కానీ ఏమి కనపడలేదు. అరె, ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు? ఎంత ఆలోచించినా నాకు బుర్ర వెలగటం లేదు, ఆలోచన తట్టటం లేదు.

మా గదికి అనుకొని ఇంకో గది కూడా వుంది అని చెప్పాను కదా. వీళ్ళు ముగ్గురూ ఆ గది తలుపుల మీద పడి మరీ అరుస్తున్నారు, ఎవరో తరుముతున్నట్టుగా. సరే ఇంక లాభం లేదనుకొని వాళ్ళ ముగ్గురిని నేను గట్టిగా పక్కకి లాగి ఆ డోర్  తెరిచి వాళ్ళ  ముగ్గిరిని పక్క గదిలోకి తోసేసాను. వీళ్ళ అరుపులకి ఆ గదిలో వున్న ఇద్దరు అమ్మాయిల తో పాటు మా హాస్టల్ లో వున్న మిగితా అమ్మాయిలు అందరూ నిద్ర లేచారు. కానీ ఎవ్వరికి విషయం ఏంటో అర్ధం కావటం లేదు. ఎవరైనా వచ్చారా? ఏమైనా జరిగిందా? ఇలా ఏవేవో ఆలోచిస్తున్నారు. కానీ ఎవరికీ గదిలోకి వచ్చే ధైర్యం మాత్రం లేదు. నేను వీళ్ళని పక్క గదిలోకి తీసుకు వెళ్ళగానే వాళ్ళు నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు , ఏమైంది ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు అని? నాకేం తెలుసు వాళ్ళకి చెప్పటానికి.


కింది ఫ్లోర్ లో వుండే అమ్మాయిలు, వార్డెన్లు అందరు ఒకటే భయపడిపోతున్నారు. సరే, ఇంక ఇక్కడే వుంటే వాళ్ళని కాపాడలేము కదా అని హాస్టల్ ఓనర్, కింద వున్న అమ్మాయిలు అందరు కలిసి పైకి రావటం మొదలుపెట్టారు. 15నిముషాలు పైగా గడుస్తున్నా కూడా వాళ్ళ అరుపు మాత్రం ఆగిపోలేదు. పక్క గది తలుపు దెగ్గరికి వచ్చిన ఓనర్ , "నేను వచ్చాను" అని చెప్పటానికి "అమ్మా" అని పిలిచాడు. అంతే , మొగ గొంతు వినపడటం తోనే ఆ దొంగ మళ్ళి వచ్చాడనుకొని మళ్ళి వీళ్ళు గట్టిగా అరిచారు. అతని మాటలు పూర్తి కూడా కాలేదు మరి. అక్కడ పరిస్థితి ఎలా వుందంటే, మొగ గొంతు విని వీళ్ళు  భయపడితే, వీళ్ళ అరుపు విని వాళ్ళు భయపడిపోయారు. ఆ ఓనర్ అతన్ని ఫాలో చేస్తూ పైకి వస్తున్న మిగితా అమ్మాయిలు వీళ్ళ అరుపులు వున్నపలంగా ఎక్కువ అవ్వటం తో ధమాలున ఒక్క ఉదుటున వాళ్ళ గదుల్లోకి వెళ్లి తలుపేసుకున్నారు. ఖచ్చితంగా ఏవరో పోయే వుంటారు , లేకపోతె ఇంతలా ఎందుకు అరుస్తారు. ఇలా వున్నాయి వాళ్ళ ఆలోచనలు. నేనేమో పక్కనే వుండి కూడా ఎందుకు అరుస్తున్నారో కూడా తెలియకుండా బిక్కమొహం వేసుకొని చూస్తున్నాను. నా పక్కనే వున్న ఇద్దరు అమ్మాయిలు (పక్క గది వాళ్ళు) నేను కలిసి ఇంక లాభం లేదనుకొని , ఆపండి తల్లులు అసలు ఎందుకు అరుస్తున్నారో కాస్త చెప్పండి అని గద్దిస్తే అప్పుడు వాళ్ళు దొంగ విషయం చెప్పారు. ఇంక అప్పుడు మాకు విషయం అర్ధం అయి , తల్లీ ఇందాక వచ్చింది దొంగ కాదు, ఓనర్ అని కాస్త ఆ అరుపు లాంటి ఏడుపు ఆపితే వాళ్ళని పిలుస్తామని చెప్పాము. అప్పుడు వాళ్ళు కాస్త శాంతించారు. డోర్ బయటనే కాపలా కాస్తున్న అతను మేము తలుపు తీయగానే లోపలకి వచ్చాడు. అయన కాస్త సర్ది చెప్పి, భయపడకండి , నేను వున్నాను అని చెప్పి వాళ్ళని సముదాయించాడు. చాలా సేపటి వరకు పాపం అతను అక్కడే కూర్చున్నాడు. అసలు వాళ్ళు ఎంతలా భయపడిపోయారంటే వాళ్ళ నీడని చూసినా భయపడిపోయే అంత. అసలుకే ఆరోజు వాళ్ళకి ఫైనల్ ఫైనల్ exam . (అంటే లాస్ట్ పేపర్ లెండి). ఇంక వాళ్ళు పరీక్షకి వెళ్ళటానికి కూడా బయపడిపోతుంటే ఫ్రెండ్స్ వెంట తీసుకొని వెళ్లి వచ్చారు. 


మరుసటి రోజు దాని ఎఫ్ఫెక్ట్ ఎలా వుందంటే, వాళ్ళ అరుపులేమో ఆ వీధి చివరి వరకు వినపడితే, హాస్టల్ లో వున్న అమ్మాయిలను విపరీతంగా భయపెట్టాయి. బయటికి వెళ్తే చాలు, అందరూ "అరె, ఏమైంది రాత్రి మీ హాస్టల్ లో, చాలా పెద్ద అరుపులు, కేకలు వినపడ్డాయి" అని అడిగేవాళ్ళు. ఇంక హాస్టల్ లో అమ్మాయిలేమో బాత్రూం కి వెళ్ళటానికి కూడా భయపడేవాళ్ళు. ఇదంతా ప్రత్యక్షంగా చుసిన నేను మాత్రం తలుచుకున్నప్పుడల్లా నవ్వుతూనే వుంటాను.

6 comments:

  1. మీ హాస్టల్ అనుభవాలు చక్కగా రాశారండి. అమ్మాయి దొంగ సంభాషణ బాగుంది.అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. నిజానికి ఆ సంభాషణ ఇంకా వుంది కానీ నాకు పూర్తిగా గుర్తు లేదు.అందుకే గుర్తున్నంత వరకే రాసాను.

      Delete
  2. did it happen to you, Karuna??

    ReplyDelete
    Replies
    1. avunu annayya, it happened to me when I was in hostel.

      Delete
  3. Still I am clue less why they shouted like that..?D o you have any..?I think they had a good conversation

    ReplyDelete
    Replies
    1. After seing everything with my own eyes also, I was clue less why they shouted like that. As you said, they did have some conversation, but it was all about opening the doar. So that might have scared them more :-) Thankyou very much.

      Delete